అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారత సంతతి మహిళ ప్రేమ వాంగ్‌జోమ్ థోంగ్‌డోక్‌ను షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు దాదాపు 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించి, వేధించిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆమె పాస్‌పోర్ట్‌పై జన్మస్థలం ‘అరుణాచల్ ప్రదేశ్‘ అని ఉండటమే ఇందుకు కారణం. చైనా అధికారులు దానిని “చెల్లదు” అని ప్రకటించి, “అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం” అని వాదించడంతో ఈ వివాదం చెలరేగింది.
ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బీజింగ్, ఢిల్లీలలోని చైనా అధికారుల వద్ద బలమైన నిరసనను (డెమార్ష్) నమోదు చేసింది. షాంఘైలోని భారత కాన్సులేట్ కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి బాధితురాలికి పూర్తి సహాయం అందించింది. ఒక భారత సీనియర్ అధికారి స్పందిస్తూ, “ఒక భారత ప్రయాణికురాలిని అర్థంలేని కారణాలతో నిర్బంధించడం దారుణం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయలేని భాగం,” అని స్పష్టం చేశారు. చైనా చర్యలు అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.
బాధితురాలు థోంగ్‌డోక్, చైనా అధికారులు మరియు సిబ్బంది తనను చూసి నవ్వారని, “చైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకో” అంటూ ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆమెకు సరైన ఆహారం, ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిసింది. ఈ ఘటనపై థోంగ్‌డోక్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ చర్యను భారతదేశ సార్వభౌమత్వానికి అవమానంగా పరిగణించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.









