తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఆర్థిక ఆరాచకం వైపు నెట్టివేయబడిందని, అడ్డగోలుగా అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక విధానాలు, భూముల కన్వర్షన్ అంశాలపై కేటీఆర్ పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌కు “పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని” ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా, లీజు భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చడం (కన్వర్షన్) అంశంపై కేటీఆర్ చేస్తున్న విమర్శలను శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. లీజు భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే జీవోలు తీసుకొచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది కేవలం ఆ జీవోల అమలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ చెబుతున్నది 30 శాతం భూమి విలువ కాదని, అది కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమేనని మంత్రి వివరించారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ భూమి విలువకు, కన్వర్షన్ ఫీజుకు ముడిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు మద్దతుగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేటీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. “పచ్చకామెర్లు వచ్చిన వ్యక్తికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది, ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి అదే” అని ఆయన విమర్శించారు. వ్యాపారవేత్తలను బెదిరించడం మానుకోవాలని కేటీఆర్‌ను హెచ్చరించిన కిరణ్ కుమార్ రెడ్డి, మంచి పనులు చేస్తున్న తమ ప్రభుత్వాన్ని అడ్డుకోవద్దని సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేటీఆర్ బుద్ధి మారడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.









