ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే చంద్రబాబు ధ్యేయమని పేర్కొన్నారు. ముఖ్యంగా, కుప్పం ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, ఈ నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా ఆయన ఈ ప్రాంత నీటి కష్టాలను శాశ్వతంగా తీర్చారని భువనేశ్వరి కొనియాడారు. పర్యటనలో భాగంగా ఆమె తుమ్మిసి చెరువు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు.
పర్యటనలో భాగంగా నడింపల్లి గ్రామంలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. డ్వాక్రా సంఘాలను స్థాపించడం ద్వారా చంద్రబాబు మహిళా సాధికారతకు బాటలు వేశారని, నేడు మహిళలు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తల స్థాయిలో నిలుస్తున్నారని ఆమె తెలిపారు. మహిళలు తమపై ఉన్న “మన వల్ల కాదు” అనే భావన నుంచి బయటపడి, సవాళ్లను పాఠాలుగా స్వీకరించి ముందుకు సాగాలని ఆమె ఉద్బోధించారు.
అభివృద్ధి, సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే చంద్రబాబు సంకల్పమని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కుప్పానికి నీటి కష్టాలు శాశ్వతంగా తీరడమే కాక, ఇటీవల 7 పరిశ్రమలు వచ్చాయని, త్వరలోనే మరో 8 సంస్థలు రానున్నాయని, వీటి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆమె వివరించారు. రాష్ట్రంలో మహిళా రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, గంజాయిపై ఉక్కుపాదం మోపడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛను కల్పించిందని ఆమె పేర్కొన్నారు.









