దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’ (SSMB29) టైటిల్ రివీల్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌లో సాంకేతిక లోపం కారణంగా అంతరాయం ఏర్పడినప్పుడు, రాజమౌళి దేవుడిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ‘రాష్ట్రీయ వానరసేన’ సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటన సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, “నాకు దేవుడిపై నమ్మకం పెద్దగా లేదు. కానీ మా నాన్నగారు టెన్షన్ పడొద్దని, హనుమంతుడు అన్నీ సవ్యంగా నడిపిస్తాడని అంటుంటారు. అయితే ఈవెంట్ సాంకేతిక లోపంతో ఆగిపోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు. అందుకే నాన్న అలా చెప్పినప్పుడు నాకు కోపం వచ్చింది” అని తీవ్ర అసహనంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయి పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రత్యేకంగా హనుమంతుడి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు హిందూ భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు రాజమౌళి వ్యాఖ్యలు హనుమంతుడిని అవమానించే విధంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవతలపై బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు, రాజమౌళిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ వివాదం సినిమాపై మరింత దృష్టిని ఆకర్షించినప్పటికీ, మూడు రోజులైనా రాజమౌళి దీనిపై ఇంకా స్పందించలేదు.









