జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ యంత్రాంగానికి సమగ్ర వ్యూహంతో ముందుకు సాగాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, ఏ చిన్న నిర్లక్ష్యానికీ తావు ఇవ్వకుండా ప్రతి నాయకుడు కట్టుదిట్టంగా పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, పార్టీ ఇన్‌చార్జి, మంత్రులకు కీలక సూచనలు చేశారు, ప్రతి ఒక్కరికి బాధ్యతలు విభజిస్తూ క్షేత్ర స్థాయి ప్రచారం మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గడచిన నెల 31, ఈ నెల 1, 4, 5 తేదీల్లో స్వయంగా రోడ్‌షోలు, కార్నర్ సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో, ఆయన ప్రతి మంత్రికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. “ప్రచారంలో ప్రతి మాట, ప్రతి అడుగు ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలి” అని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా, సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ ప్రచారంపై కాంగ్రెస్ బలమైన కౌంటర్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బీఆర్‌ఎస్ తప్పుడు సర్వేలు విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా ప్రతి గంటకోసారి సోషల్ మీడియాలో సమాధానం ఇవ్వాలని, తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలని మంత్రులకు స్పష్టం చేశారు. రాబోయే మూడు రోజులు అత్యంత కీలకమని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది.









