UPDATES  

NEWS

 జంతు సంరక్షణపై వంతారాకు ఐరాస సంస్థ ‘సైట్స్’ ప్రశంసలు

భారతదేశం జంతు సంరక్షణకు చూపుతున్న నిబద్ధతపై ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలోని సంస్థ సైట్స్ (CITES) ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో, గుజరాత్‌లోని అనంత్ అంబానీ స్థాపించిన వంతారా కాంప్లెక్స్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని సైట్స్ పేర్కొంది.

సైట్స్ బృందం భారత్‌లో విస్తృతంగా పరిశీలన జరిపి, రాబోయే 79వ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్‌ను సిద్ధం చేసింది. ఈ నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ, అక్కడి పశువైద్య సేవలు మరియు వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. ముఖ్యంగా, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా ప్రమాదంలో ఉన్న Appendix-I జాబితాలోని జంతువులను కూడా ఈ కేంద్రాలు సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సైట్స్ నొక్కి చెప్పింది.

వంతారా సంస్థలు అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు మరియు జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని సైట్స్ పేర్కొంది. ఈ కేంద్రాలు చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని, ఇక్కడ భారత్‌కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనడానికి లేదా వాణిజ్య కార్యకలాపాలు జరగడానికి ఎటువంటి ఆధారాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని సంస్థ నిర్వాహకులు వివరించారు. ఈ కేంద్రాలను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా సందర్శించి, వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |