ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి భారీ స్థాయిలో పదోన్నతులు (Promotions) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో రెండేళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్లకు మార్గం సుగమం చేస్తూ, రెండేళ్ల సర్వీస్ రూల్‌ను ఏపీ ప్రభుత్వం ఒక సంవత్సరానికి తగ్గించింది.
ఈ పదోన్నతుల వల్ల పంచాయతీ కార్యదర్శులు సీనియర్ అసిస్టెంట్లు కానున్నారు. వీరిలో దాదాపు 660 మందికి డిప్యూటీ ఎంపీడీవో (Deputy MPDO) హోదా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పదోన్నతుల ప్రతిపాదనను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించాక ప్రభుత్వానికి పంపగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత చూపడంతో మార్గం సుగమం అయ్యింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రమోషన్ల కారణంగా పంచాయతీరాజ్ శాఖలో సిబ్బంది కొరత తగ్గడం సహా పనితీరు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రమోషన్లు, ఖాళీల భర్తీ తర్వాత గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని తెలుస్తోంది.









