మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురు గాలులతో అల్లకల్లోలం సృష్టించిన నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సోషల్ మీడియా ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి లోకేశ్, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి ఆహారం, మంచినీరు, ఇతర వసతులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న వేళ… జగన్ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (X) వేదికగా స్పందించారు. విపత్తుల సమయంలో, మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు చేతనైన సాయం చేస్తారని, కానీ మాజీ సీఎం జగన్ మాత్రం ‘విష రాజకీయాలు’ చేస్తున్నారని, ‘ఫేక్ న్యూస్’ వ్యాప్తి చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ బెంగళూరు ప్యాలెస్‌లో సేదతీరుతూ, తుఫాను ప్రాంత ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసేలా తన దొంగ మీడియా సాక్షి ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నాడంటూ లోకేశ్ విమర్శించారు.
కాకినాడ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని లోకేశ్ స్పష్టం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ప్రజలు అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ (18004250101) కు కాల్ చేయాలని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా తెలిపారు.









