బంగ్లాదేశ్-వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ ఊహించని విధంగా అవుట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చిట్టగాంగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా, 166 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో 17 పరుగులు అవసరమైన సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
రొమారియో షెఫర్డ్ వేసిన బంతిని టస్కిన్ అహ్మద్ భారీ సిక్సర్‌గా మలిచి అభిమానులకు ఆశలు రేపాడు. దాంతో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే, అంపైర్లు వెంటనే అతడిని అవుట్‌గా ప్రకటించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. రీ-ప్లేలో చూస్తే, టస్కిన్ షాట్ ఆడే క్రమంలో కాళ్లు స్టంప్‌లకు తగలడంతో బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో టస్కిన్‌ను ‘హిట్-వికెట్’ (Hit-Wicket) అవుట్‌గా ప్రకటించారు.
ఈ సంఘటన బంగ్లాదేశ్ అభిమానులను నిరాశకు గురి చేసింది. బంగ్లాదేశ్ జట్టు 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి, 19.4 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ఆరంభం నుంచే తడబాటు కనిపించింది. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో తంజిమ్ హాసన్ షాకిబ్, నాసుమ్ అహ్మద్ కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. వెస్టిండీస్ తరఫున జేడన్ సీల్స్, జేసన్ హోల్డర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.









