తమిళనాడులో సినీ మరియు రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న బాంబు బెదిరింపుల పరంపర మరోసారి కలకలం సృష్టించింది. తాజాగా సూపర్‌స్టార్ రజినీకాంత్ మరియు ప్రముఖ నటుడు ధనుష్ నివాసాలతో పాటు, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని కూడా పేల్చివేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందింది. ఈ బెదిరింపు చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈమెయిల్ అందిన వెంటనే ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. పోయెస్ గార్డెన్‌లోని రజినీకాంత్, ధనుష్ నివాసాలు మరియు కీల్పాక్కంలో ఉన్న కాంగ్రెస్ నేత సెల్వపెరుతంగై ఇంట్లో భద్రతను పెంచారు. బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించి, ఆయా ప్రదేశాలలో క్లష్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇది తప్పుడు బెదిరింపు (Hoax) అని భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ప్రముఖులకు బెదిరింపులు రావడం ఇది కొత్త కాదు. ఈ నెల 3న ముఖ్యమంత్రి స్టాలిన్, నటి త్రిష నివాసాలు, బీజేపీ కార్యాలయం సహా పలుచోట్లకు బెదిరింపులు వచ్చాయి. అలాగే, అక్టోబర్ 13న కూడా సీఎం స్టాలిన్, రజినీకాంత్ ఇళ్లకు ఇలాంటి మెయిల్స్ అందాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ వరుస బెదిరింపుల వెనుక ఒకే ముఠా ఉందా, లేదా వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో అధికారులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.









