ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అక్టోబర్ 25న జరిగిన మూడో వన్డే సమయంలో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ అందుకునే క్రమంలో పక్కటెముకలకు గాయమైంది. ఆసుపత్రిలో నిర్వహించిన స్కానింగ్‌లో అయ్యర్ ప్లీహానికి (స్ప్లీన్) గాయం అయినట్లు నిర్ధారించారు. ఆ గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ ప్రారంభమై పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో, వెంటనే వైద్యులు అతన్ని ఐసీయూలో చేర్చారు.
శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా అధికారికంగా అప్‌డేట్ ఇచ్చారు. “మూడో వన్డేలో ఫీల్డింగ్ సమయంలో శ్రేయాస్ అయ్యర్ పక్కటెముకలకు గాయం అయింది. ప్లీహానికి గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏర్పడినప్పటికీ, ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది” అని ఆయన తెలిపారు. సిడ్నీతో పాటు భారత్‌లోని నిపుణుల సలహాలతో ఆయనను వారం రోజుల పాటు కఠిన పర్యవేక్షణలో ఉంచనున్నారు.
గాయం తీవ్రత దృష్ట్యా, శ్రేయాస్ అయ్యర్ తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు పంపడానికి బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయ్యర్ త్వరగా కోలుకుంటున్నారని, టీమ్ డాక్టర్లు నిత్యం ఆయన్ను పరిశీలిస్తూ నివేదికలు పంపిస్తున్నారని బీసీసీఐ కార్యదర్శి వెల్లడించారు.









