కర్నూలు నగర శివారులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది మృతి చెందిన ఘటనలో, ప్రమాదానికి గల అసలు కారణం పోలీసుల విచారణలో వెల్లడైంది. బస్సు డీకొట్టడానికి ముందే, ఆ తెల్లవారుజామున బైక్ స్కిడ్ అయి జాతీయ రహదారిపై పడి ఉండటం వల్లే ఈ ఘోరం జరిగిందని తేలింది. బైక్ నడుపుతున్న శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామిని తుగ్గలిలో వదిలేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
గురువారం తెల్లవారుజామున 2:24 గంటల సమయంలో కియా షోరూం సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరిన శివశంకర్ బైక్, కొద్దిసేపటికే చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించగా, వెనుక ఉన్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. శివశంకర్‌ను రోడ్డు పక్కకు తీసుకెళ్లిన ఎర్రిస్వామి, బైక్‌ను రోడ్డు మధ్యలో నుంచి పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు.
ఈలోపే, రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన వేమూరి కావేరి బస్సు ఢీకొట్టి, దాన్ని బస్సు కింది భాగంలోకి ఈడ్చుకెళ్లింది. ఈ రాపిడికి మంటలు చెలరేగటంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. భయపడిపోయిన ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోగా, పెట్రోల్ బంకులోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎర్రిస్వామి విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. ప్రస్తుతం, మృతి చెందిన 19 మందిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి.









