తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి ఆదరణ ఉన్న విశాల్, ప్రస్తుతం తన సినిమాల విషయంలో వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. ముఖ్యంగా దర్శకులతో విభేదాలు రావడంతో వారిని ప్రాజెక్టుల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. గతంలో ‘తుప్పారివాలం 2’ సినిమా నుంచి దర్శకుడు మిస్కిన్‌ను తొలగించిన విశాల్, స్వయంగా ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ అయిన ‘మకుటం’ నుంచి దర్శకుడు రవి అరసును కూడా తొలగించారు.
‘మకుటం’ సినిమాను ముందుగా రవి అరసు తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు, టీజర్ కూడా విడుదలై మంచి స్పందన వచ్చింది. కానీ దీపావళి కానుకగా విడుదలైన పోస్టర్‌లో మాత్రం దర్శకుడిగా విశాల్ పేరు కనిపించడంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. ఒకవైపు ‘తుప్పారివాలం 2’ షూటింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో, మరో సినిమాను కూడా తన భుజాలపై వేసుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ప్రతి సినిమా నుంచి దర్శకులను మార్చితే, భవిష్యత్తులో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు వస్తారని కామెంట్స్ చేస్తున్నారు.
‘మార్క్ అంటోనీ’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని అభిమానులు అనుకుంటున్న సమయంలో, విశాల్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాల్‌కు ఒక సాలిడ్ హిట్ అవసరం ఉన్న తరుణంలో, ఈ తరహా వివాదాలు, పనుల్లో జాప్యం వల్ల ఆ సినిమాలు సకాలంలో పూర్తి కాకపోతే, అది కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.









