UPDATES  

NEWS

 దగ్గు మందు వాడకంపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

దేశవ్యాప్తంగా పిల్లలకు వాడే దగ్గు మందుల నాణ్యత, వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా వాడొద్దని, ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని, వాటికి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.

 

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో కలుషిత దగ్గు మందు కారణంగా కొందరు చిన్నారులు మరణించారన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆదేశాలతో ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నిపుణుల బృందం ఛింద్వారాలో పర్యటించి మరణాలకు గల కారణాలపై విశ్లేషణ జరిపింది.

 

చిన్నారులు వాడిన 19 రకాల మందుల శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు సిరప్‌లో డైఇథైలిన్ గ్లైకాల్ (DEG) అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఈ సిరప్‌ను తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఒక యూనిట్‌లో తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల అనంతరం, ఆ తయారీ యూనిట్ లైసెన్సును రద్దు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సిఫార్సు చేసింది. అంతేకాకుండా, సంబంధిత కంపెనీపై క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

ఈ సందర్భంగా, ఔషధ తయారీ కంపెనీలన్నీ సవరించిన షెడ్యూల్ ‘ఎం’ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆరోగ్య కార్యదర్శి నొక్కిచెప్పారు. పిల్లల విషయంలో దగ్గు మందుల వాడకాన్ని తగ్గించేలా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన అసాధారణ సంఘటనలపై నిఘా పెంచాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సకాలంలో నివేదికలు తెప్పించుకోవాలని ఆదేశించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |