UPDATES  

NEWS

 లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు..!

ప్రశాంతంగా ఉండే హిమాయల ప్రాంతంలో ఒక్కసారిగా నిరసనలు భగ్గుమన్నాయి. లడక్ రాజధాని లేహ్‌లో ఆందోళనకారుల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయానికి నిరసనకారులు నిప్పుపెట్టారు. సెక్యూరిటీ వాహనాలను సైతం తగలబెట్టారు. పరిస్థితి శృతి మించడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అసలు మేటరేంటి? ఉన్నట్లుండి నిరసనలు ఈ స్థాయిలో జరగడానికి కారణమేంటి?

 

జమ్మూకాశ్మీర్‌లోని లడక్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కావాలంటూ నిరసనలు క్రమంగా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో 35 రోజులుగా నిరాహర దీక్షకు సోనమ్ వాంగ్‌చుక్ దిగారు. ఆయన చేస్తున్న దీక్షను భగ్నం చేశారు పోలీసులు. సోనమ్‌ను ఆసుపత్రికి తరలించే క్రమంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు.

 

ఈ నేపథ్యంలో లెహ్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఆ తర్వాత పోలీసుల వాహనాలకు నిప్పుపెట్టి రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు.

 

లడక్‌కు సంబంధించి వివాదం ఇప్పటిది కాదు. 1980 దశకంలో లడక్ ప్రాంతానికి యూటీ హోదా ఆందోళన జరుగుతోంది. ఆ ప్రాంత ప్రజలు చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర హోదాతోపాటు 6వ షెడ్యూల్ హోదా కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష చేపట్టడం, 35 రోజులకు పైగా గడిచిపోయింది. ఆయన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత కూడా.

 

సోనమ్ దీక్షపై కేంద్రం నుంచి ఎలాంటి కదలిక లేదు. చర్చలకు ఎలాంటి స్పందన రాలేదు. సోనమ్ ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 2019 అక్టోబరు 31న జమ్మూకాశ్మీర్ నుంచి లడఖ్‌ను వేరు చేసింది కేంద్రం.

 

కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో లడక్‎కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత ఆందోళనకు దిగారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇటు నిరసనకారులు.. అటు పోలీసుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో లడఖ్‌లో జరిగిన మొదటి హింసాత్మక సంఘటన ఇది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |