UPDATES  

NEWS

 రష్యాతో భారత్ మరో భారీ డీల్..? భారత్ అమ్ములపొదిలోకి మరిన్ని ఎస్-400 యూనిట్లు..!

భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన ఎస్-400 ట్రయంఫ్‌ను మరిన్ని కొనుగోలు చేసేందుకు రష్యాతో చర్చలు ప్రారంభించింది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన ఉన్నతస్థాయి రక్షణ అధికారి ఒకరు స్వయంగా ధ్రువీకరించారు. భారత్ ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను వినియోగిస్తోందని, అదనపు యూనిట్ల సరఫరా కోసం ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని రష్యా సైనిక-సాంకేతిక సహకార సమాఖ్య అధిపతి దిమిత్రి షుగేవ్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘టాస్’కు వెల్లడించారు.

 

చైనా నుంచి పెరుగుతున్న సైనిక ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతో భారత్, రష్యాల మధ్య 2018లో 5.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం కింద మొత్తం ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల సరఫరాలో జాప్యం జరిగింది. చివరి రెండు యూనిట్లు 2026, 2027 నాటికి అందనున్నాయి. ఈ నేపథ్యంలో, అదనపు వ్యవస్థల కోసం చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ఇటీవల కాలంలో ఈ క్షిపణి వ్యవస్థ తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడమే తాజా చర్చలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత మే నెలలో పాకిస్థాన్‌పై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఎస్-400 గగనతల రక్షణ కవచంలా నిలిచింది. శత్రు దేశం నుంచి దూసుకొచ్చిన పలు క్షిపణులను గాల్లోనే అడ్డుకుని విజయవంతంగా నాశనం చేసింది.

 

మరోవైపు, ఆయుధాల కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసించారు. రష్యా నుంచి వనరుల కొనుగోలును ఆపాలని అగ్రరాజ్యం డిమాండ్ చేసినప్పటికీ భారత్ స్వతంత్రంగా వ్యవహరించడాన్ని తాము అభినందిస్తున్నామని ఆయన బుధవారం పేర్కొన్నారు.

 

భారత్ ఇటీవల ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నప్పటికీ, రష్యానే ఇప్పటికీ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, 2020-2024 మధ్య కాలంలో భారత్ ఆయుధ దిగుమతుల్లో 36 శాతం వాటా రష్యాదే. బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, టీ-90 ట్యాంకులు, ఏకే-203 రైఫిళ్ల తయారీ వంటి ఎన్నో కీలక రక్షణ ప్రాజెక్టుల్లో ఇరు దేశాలు దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |