UPDATES  

NEWS

 సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ తరహా పట్టుదల ప్రదర్శించాలి: కేటీఆర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ కీలక సవాల్ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కేంద్రం ఆమోదం పొందేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 

ఆదివారం శాసనసభలో పంచాయతీ రాజ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. “ప్రధానికి ఐదుసార్లు లేఖ రాశానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అపాయింట్‌మెంట్లు అడగడం కాదు, చిత్తశుద్ధిని చాటుకోవాలి. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే, రేవంత్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ బిల్లు పాసయ్యే వరకు నిరవధిక నిరాహార దీక్షకు దిగాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

 

గతంలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి, లక్ష్యం నెరవేరే వరకు తిరిగి రానని ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. “అదే తరహా పట్టుదలను రేవంత్ రెడ్డి కూడా ప్రదర్శించాలి. బీసీ బిల్లు సాధించే వరకు ఢిల్లీలోనే ఉండాలి” అని అన్నారు. 2004లోనే దేశంలో తొలిసారిగా ప్రత్యేక ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన, చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని వివరించారు.

 

బీసీ రిజర్వేషన్లపై ఐదుసార్లు మాట మార్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు. “42 శాతం బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌కు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. కానీ చట్టాలు లొసుగులు లేకుండా ఉండాలి. లేదంటే న్యాయ సమీక్షలో అవి నిలబడవు. కేవలం ప్రకటనలు కాదు, నిబద్ధత ముఖ్యం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |