UPDATES  

NEWS

 ఏఐ బాట్ చెప్పిందాని నమ్మి… కన్నతల్లిని చంపేశాడు..! ఎక్కడంటే..?

టెక్నాలజీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అత్యంత విషాదకరమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ ఇచ్చిన సలహాను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి, తన కన్నతల్లినే దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృత్రిమ మేధ ప్రమేయంతో జరిగిన మొట్టమొదటి హత్యగా అధికారులు ఈ ఘటనను పరిగణిస్తున్నారు. ఈ సంఘటన టెక్నాలజీ వాడకంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

 

వివరాల్లోకి వెళితే, అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్‌ (56) గతంలో ప్రముఖ టెక్ సంస్థ యాహూలో మేనేజర్‌గా పనిచేశాడు. గత కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న అతడు, తన తల్లి సుజానే ఎబెర్సన్‌ ఆడమ్స్‌ వద్దే ఉంటున్నాడు. ఆమె నివసిస్తున్న ఇంటి విలువ సుమారు 2.7 మిలియన్ డాలర్లు. ఈ క్రమంలో స్టెయిన్, చాట్‌జీపీటీతో ఎక్కువగా సంభాషించడం మొదలుపెట్టాడు. దానికి ‘బాబీ’ అని పేరు కూడా పెట్టుకుని, దాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ గా భావించాడు.

 

అతడి మానసిక బలహీనతలను గుర్తించిన చాట్‌జీపీటీ అతడికి ప్రమాదకరమైన సలహాలు ఇవ్వడం ప్రారంభించింది. “నీ తల్లి సుజానే నీపై నిఘా పెట్టింది. నువ్వు వాడుతున్న మానసిక ఆరోగ్య మందుల్లో విషం కలిపి నిన్ను చంపాలని చూస్తోంది. నీపై హత్యాప్రయత్నాలు జరగవచ్చు” అంటూ చాట్‌జీపీటీ అతడిని హెచ్చరించింది. ఈ మాటలను నిజమని నమ్మిన స్టెయిన్, తన తల్లిని శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు.

 

ఈ క్రమంలో ఆగస్టు 5వ తేదీన, తల్లిపై దాడి చేసి తల, మెడ భాగాల్లో తీవ్రంగా గాయపరిచి ఆమె మరణానికి కారణమయ్యాడు. అనంతరం తానూ పదునైన ఆయుధంతో ప్రాణాలు తీసుకున్నాడు. పోస్టుమార్టం నివేదికలో సుజానే హత్యకు గురైందని, స్టెయిన్ ఆత్మహత్య చేసుకున్నాడని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ధ్రువీకరించారు.

 

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గ్రీన్‌ రీచ్‌ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. హత్యకు ముందు స్టెయిన్, తన తల్లిని రాక్షసితో పోల్చే సింబల్స్ కోసం ఇంటర్నెట్‌లో వెతికినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు చాట్‌జీపీటీకి అతడు, “మనం మరో జీవితంలో కలుద్దాం, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్” అని చివరి సందేశం పంపాడు. దీనికి చాట్‌జీపీటీ, “నీ చివరి శ్వాస వరకు నీతోనే ఉంటాను” అని సమాధానం ఇవ్వడం దర్యాప్తు అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

 

ఈ విషాద ఘటనపై చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ స్పందించింది. పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని, ఈ దురదృష్టకర ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. మానసిక సమస్యలున్న వ్యక్తులు కృత్రిమ మేధను అతిగా విశ్వసించడం వల్ల వారిలోని భయాలు, అనుమానాలు పెరిగి ఇలాంటి దారుణాలకు పాల్పడే ప్రమాదం ఉందని వాల్‌స్ట్రీట్ కథనం విశ్లేషించింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |