ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగాన్ని పరుగులు తీయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. ముఖ్యంగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు నిధుల్ని తీసుకురావడం ప్రారంభించారు. ఇందులో భాగంగా కేంద్రం తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. ఈ నిధులతో బాపట్ల సమీపంలోని సూర్య లంక బీచ్ కు మహర్దశ పట్టబోతోంది.
రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద రూ.97.52 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం ఇచ్చింది.. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. త్వరలోనే సూర్యలంక ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనమివ్వబోతుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
centre approves rs 97 52 cr funds to Surya lanka beach in ap under swadesi darshan 2 0 scheme
ప్రధానంగా సూర్యలంక బీచ్ లో మౌలిక వసతుల కల్పన, బీచ్ ను పరిశుభ్రంగా ఉంచే అంశంపై దృష్టిసారించి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిధుల వినియోగం విషయానికి వస్తే రూ.15.43 కోట్లతో సూర్యలంక బీచ్ లో పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి కల్పన, రూ.4.37 కోట్లతో షాపింగ్ స్ట్రీట్ అభివృద్ధి,రూ. 7.76 కోట్లతో స్థిరమైన పర్యాటకాభివృద్ధి, పర్యాటకుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, రూ.11.69 కోట్లతో కెనాల్ ఎక్స్‌పీరియన్స్ డెవలప్ మెంట్, రూ.19.36 కోట్లతో సూర్యలంక ఎక్స్ పీరియన్స్ జోన్, రూ. 18 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పించనున్నామన్నారు. అనంతరం బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తామన్నారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో చొరవతో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి రూ.269.86 కోట్లు నిధులు విడుదలయ్యాయి. అందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ క్రింద అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు రూ.172.34 కోట్లు మంజూరు కాగా సంబంధిత పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. తాజాగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ కు రూ.97.52 కోట్ల విడుదలకు ఆమోదం లభించింది.