దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ను జనం డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధించే పరిస్ధితి లేకపోవడంతో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేయిస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలంటేనే భయపడే పరిస్ధితి తీసుకురానుంది.
రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్నా చాలా మంది ఇప్పటికీ డౌన్ లోడ్ చేసుకుని బెట్టింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. వీటికి అడ్డుకట్ట వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్ధితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏదో విధంగా ఇలా బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వారికి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ సిద్దం చేసింది. ఐటీ శాఖ సహాయంలో కొత్త సాఫ్ట్ వేర్ ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం తమకు వచ్చేలా చేయబోతోంది.
సైబర్ విభాగం ద్వారా లభించిన ఈ బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ మొబైల్ సమాచారం ఆధారంగా సదరు మొబైల్ ఫోన్ ను బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వీలైనంత త్వరగా ఈ సాఫ్ట్ వేర్ తయారు చేసి ఇమ్మని హోంశాఖ ఐటీ శాఖను కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఐటీ శాఖ ఈ సాప్ట్ వేర్ తయారీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇది పూర్తి కాగానే సదరు సాఫ్ట్ వేర్ ను హోంశాఖకు అందిస్తుంది. దీని సాయంతో బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడర్ల భరతం పట్టబోతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ కూడా తదుపరి చర్యలపై దృష్టిసారిస్తోంది.