UPDATES  

NEWS

 కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం..! ఉగాది నుంచి ‘జీరో పావర్టీ – పీ4’ విధానం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఉగాది (మార్చి 30) నుంచి ‘జీరో పావర్టీ – పి4 పాలసీ’ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

 

మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ‘పి4’ విధానం సామాజిక-ఆర్థికాభివృద్ధిలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతుంది. ఇది సమ్మిళిత వృద్ధి ద్వారా సమాజంలోని బలహీన వర్గాలను పైకి లేపడానికి నిరంతరంగా పనిచేస్తుంది” అని అన్నారు. ‘పీ4’ అంటే ‘పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్’ అని ఆయన స్పష్టం చేశారు.

 

జీరో పావర్టీ

 

స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 ‘పది సూత్రాల’లో ఒకటైన ‘సున్నా పేదరికం’ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ విధానం దోహదపడుతుందని సీఎం తెలిపారు. ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐలు), ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.’బంగారు కుటుంబాలు’ – ‘మార్గదర్శి’ల తోడ్పాటు ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సాధికారత సాధిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

 

ఇందులో భాగంగా పేద కుటుంబాలకు గృహ స్థలాలు, ఇళ్లు, మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను కల్పించనున్నారు. ప్రతి కుటుంబంలోనూ వ్యవస్థాపకతను ప్రోత్సహించనున్నారు.

 

బంగారు కుటుంబాలు

 

ఈ పథకంలో లబ్ధిదారులను ‘బంగారు కుటుంబాలు’ అని, సహాయం చేసే ఆర్థికంగా బలమైన వారిని ‘మార్గదర్శి’ అని పిలుస్తారు. ఈ పేర్లను ప్రజల సూచనల మేరకే ఖరారు చేశారు. ఆర్థికంగా అండగా నిలిచే ‘మార్గదర్శి’లు తమకు తోచిన విధంగా నిధులతో పాటు, సమయం ఉన్నవారు ఆర్థిక విషయాల్లో సలహాలు, కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలు, విద్యా ఖర్చులకు సహాయం లేదా వ్యాపారాలకు పెట్టుబడి వంటి సహాయం కూడా అందించవచ్చు.

 

ప్రభుత్వ పర్యవేక్షణ, పారదర్శక లావాదేవీలు

 

ప్రభుత్వం తన డేటాబేస్‌లు, సర్వేల ద్వారా అర్హులైన ‘బంగారు కుటుంబాల’ను గుర్తిస్తుంది. వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయి. ఈ విధానంలో ప్రభుత్వం కేవలం పాలసీని రూపొందిస్తుంది, ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉండదు.

 

పీ4 ద్వారానే అన్ని లావాదేవీలు

 

‘మార్గదర్శి’లు తమకు నచ్చిన కుటుంబాలను ఎంచుకుని సహాయం అందించవచ్చు. ప్రభుత్వం ఇరు వర్గాల మధ్య సమన్వయం చేస్తుంది. అందించే సహాయం ‘పి4’ వేదికపై నమోదు చేస్తారు. అవసరమైన నిధుల వివరాలను కుటుంబాలు లేదా గ్రామాలు ఆన్‌లైన్‌లో తెలియజేస్తాయి. వాటిని ప్రభుత్వ అధికారులు నిర్ధారిస్తారు. అన్ని లావాదేవీలు ‘పి4’ వేదిక ద్వారానే జరుగుతాయి.

 

మొదటి దశలో 20 లక్షల మంది

 

మొదటి దశలో అత్యంత వెనుకబడిన 20 లక్షల కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత మిగిలిన అర్హులైన కుటుంబాలను కలుపుతారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడానికి ‘పి4 సొసైటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా, నియోజకవర్గం మరియు గ్రామ సచివాలయ స్థాయిలోనూ దీని విభాగాలు ఉంటాయి. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ప్రతినిధులు, పౌర సంఘాలు ఈ సొసైటీలో సభ్యులుగా ఉంటారు. ఈ వినూత్న విధానం ద్వారా ప్రజలు, ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతారని, ఇది సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని మరియు దేశంలో పేదరిక నిర్మూలనకు ఒక ఆదర్శవంతమైన నమూనాని సృష్టిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |