భూ భారతి చట్టం అమలుపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఏప్రిల్ నెలలో భూ భారతి చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
శాసనసభలో రెవెన్యూ పద్దుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ.. రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిన ధరణిని తాము అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలుపుతామని తమ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ధరణిని రద్దు చేసి, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన భూ భారతి చట్టాన్ని ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.
మూడు నెలల్లోనే విధివిధానాలు రూపొందించి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరిందని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో కూర్చుని నిబంధనలు రూపొందించకుండా, విస్తృత స్థాయిలో అధికారులు, మేధావులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుని, అందరి అభిప్రాయాలను క్రోడీకరించి భూ భారతి చట్టాన్ని తయారు చేసిన విధంగానే విధివిధానాలు కూడా రూపొందించామని మంత్రి వివరించారు.