ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల విషయంలో చైనా, కెనడా, మెక్సికోలతో భారత్‌ను చూడబోమని అమెరికా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో భారత్ – అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ చర్చల సందర్భంగా అమెరికా ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
భారత్ – యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలో భారత అధికారులతో ఆ బృందం చర్చలు ప్రారంభించింది. ఇరుదేశాలు వాణిజ్యంపై శుక్రవారం నాటికి ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. రెండు దేశాల ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం ఉంటుందని భావిస్తున్నామని చర్చల్లో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు.
కాగా, ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్‌లో వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు అని మరో అధికారి తెలిపారు. ఈ పర్యటనలో వాణిజ్యం, సుంకాలు వంటి అంశాలతో పాటు ఇరుదేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.