పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్‌సభ ఈరోజు (మార్చి 27) ఆమోదించింది. చొరబాటు, అక్రమ వలసలను ఆపడం లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు పేరు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్లు 2025. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కోసం వస్తున్న వలసదారులను మేము స్వాగతిస్తామని హోంమంత్రి లోక్‌సభలో వెల్లడించారు. విద్య, వ్యాపారం, పరిశోధన కోసం దేశానికి వచ్చే వారిని మేము స్వాగతిస్తాము. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది ప్రధాని మోడీ లక్ష్యం. అందుకే చాలా పాత చట్టాలను రద్దు చేశామన్నారు.
వలస అనేది ఒక ప్రత్యేక సమస్య కాదు. దేశంలోని అనేక సమస్యలు దీనితో ముడిపడి ఉన్నాయి. జాతీయ భద్రత దృష్ట్యా, దేశ సరిహద్దులోకి ఎవరు ప్రవేశిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేశ భద్రతకు హాని కలిగించే వారిపై తీవ్రంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈ బిల్లు దేశ భద్రతను బలోపేతం చేస్తుందని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు సహాయపడుతుందని కేంద్ర హోం మంత్రి అన్నారు.
పాత చట్టాలను రద్దు చేస్తాం
ఈ బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత, వలసలు, విదేశీ పౌరులకు సంబంధించిన నాలుగు పాత చట్టాలు కూడా రద్దు చేయబడతాయి. దీంతో అక్రమ చోరబాటుదారులకు అడ్డుకట్టపడుతుంది. ఇమ్మిగ్రేషన్ అండ్ విదేశీ బిల్లు 2025 చట్టంగా మారిన తర్వాత ప్రభుత్వం 4 చట్టాలను రద్దు చేస్తుంది. వీటిలో విదేశీయుల చట్టం 1946, పాస్‌పోర్ట్ చట్టం 1920, విదేశీయుల నమోదు చట్టం 1939, వలస చట్టం 2000 ఉన్నాయి.
ఇమ్మిగ్రేషన్ బిల్లు అమల్లోకి వస్తే..
ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025 ప్రకారం.. ఎవరైనా నకిలీ పాస్‌పోర్ట్ లేదా వీసా ఉపయోగించి భారత్ లోకి ప్రవేశిస్తే లేదా దేశంలో ఉంటున్నట్లు తేలితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.