UPDATES  

NEWS

 డ్రోన్ పరిశ్రమకు భారీగా పెట్టుబడులు..! డ్రోన్ సిటీ గా ఏపీ..?

అభివృద్ధిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు విస్తరించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన పరిశ్రమల్ని ప్రోత్సహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ద్వారా పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని భావిస్తోంది. అందులో భాగంగా.. కర్నూలు జిల్లా ఓర్వకల్లుల్లో డ్రోన్ సిటీని ప్రతిపాదించింది. ఇప్పటికే.. పొందిన ఈ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానిస్తున్నారు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ దినేష్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా.. ఈ ప్రాంతంలో డ్రోన్ పరిశ్రమకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల్ని వివరించేందుకు విజయవాడలోని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.

 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో డ్రోన్ల తయారీలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు డ్రోన్ సిటీ ఆలోచనను చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కర్నూలు జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ డ్రోన్ సిటీలో డ్రోన్లకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ దినేష్ వెల్లడించారు. ఈ సిటీలో డ్రోన్ తయారీ, సేవలు, విడిభాగాల యూనిట్లు అన్నింటిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ సిటీలో 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపిన దినేష్.. అందుకు తగ్గట్టుగానే విదేశీ పెట్టుబడుల్ని సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఓర్వకల్లులో అతిపెద్ద కామన్‌ టెస్టింగ్‌ ఫెసిలిటీని కల్పించనున్నట్లు తెలిపారు.

 

డ్రోన్ల తయారీలో ప్రస్తుతానికి మనకంటే చైనా, బెల్జియం, అమెరికా వంటి దేశాలు చాలా ముందున్నాయి. ఆయా దేశాల కంటే ఎక్కువగా ప్రోత్సహకాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. డ్రోన్ల తయారీకి సంబంధించిన వివిధ విభాగాల్లోని యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి భూములను కేటాయిస్తామని ప్రకటించారు. పరిశ్రమలకు భూములు, ఇతర వసతులతో పాటు మంచి నైపుణ్యాలున్న మానవ వనరుల్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం.. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు.

 

రానున్న కాలంలో డ్రోన్ల పరిశ్రమలో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు రానుండగా.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మానుఫ్యాక్చరింగ్‌ సంస్థల భాగస్వామ్యంతో ఇప్పటికే విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాల్ని ప్రారంభించారు. గతేడాదే.. కర్నూలులోని ఓర్వకల్లులో డ్రోన్ సిటీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినేట్ ఆమోదముద్ర వేయగా.. డ్రోన్ పాలసీ 2024ను సైతం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సిటీలో పెట్టుబడుల రూపంలో రూ.1000 కోట్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

దాంతో పాటే.. పెట్టుబడులు పెట్టనున్న సంస్థలకు భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు కల్పించనున్నారు. ఆయా సంస్థలకు మూల‌ధ‌న పెట్టుబ‌డి పై రూ.5 కోట్లకు మించకుండా 20 శాతం రాయితీ క‌ల్పించనున్నారు. అలాగే ఆయా సంస్థలకు సరఫరా చేసే విద్యుత్ ధరల్లో భారీగా డిస్కౌంట్ ఇవ్వనున్నారు. యూనిట్ ధ‌ర‌లో రూ.1 రాయితీ రూపంలో ఇవ్వనుండగా.. ఏడాదికి రూ.1 లక్ష మించకుండా రెండేళ్ల పాటు ప్రోత్సాహం అందించనున్నారు. అలాగే.. పూర్తి స్థాయి స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వనున్నారు. వారికి కేటాయించనున్న భూముల బదలాయింపులో స్టాంపు డ్యూటీని ఉపసంహరించడంతో పాటు లీజు ధరల్లో 50శాతం రాయితీ కల్పించనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |