వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిందా? సాయిరెడ్డి నిర్ణయం వెనుక ఏం జరిగింది? చేసిన పాపాల నుంచి తప్పించుకునే ఆయన ఈ స్కెచ్ వేశారా? వైసీపీ ప్రస్తుతం పరిస్థితుల్లో పార్టీని వదిలి వేయడం వెనుక కారణాలేంటి? విజయసాయిరెడ్డి అప్రూవర్ అయితే జగన్ జైలుకేనా? పులివెందులకు మళ్లీ ఉప ఎన్నిక రావడం ఖాయమేనా? లేక వైసీపీ రాజకీయంగా వేసిన ఎత్తుగడా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. శుక్రవారం వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఢిల్లీలో జేపీసీ మీటింగ్ జరిగింది. ఈ భేటీ ఆయన హాజరయ్యారు. అందులో ఆయన సభ్యుడు కూడా. అయితే సాయిరెడ్డి రాజీనామా ప్రకటనకు ముందు కొంతమంది ఫ్యామిలీ సభ్యులు, అనుచరులకు ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం.
తాను సంచనల నిర్ణయం తీసుకుంటున్నానని, దాన్ని చూసి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారట విజయసాయిరెడ్డి. తనను మీరు కాంట్రాక్ట్ చేయవద్దని చెప్పి ఆయన తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఢిల్లీలో తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
పది రోజులుగా విజయసాయిరెడ్డి రాజీనామాపై ఢిల్లీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. దీన్ని జర్నలిస్టులు సీరియస్‌గా తీసుకోలేదు. సరదాగా చెబుతున్నారని భావించారు. ఇక విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారితే జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవు. జగన్ కేసులన్నింటిలోనూ ఏ-2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయా కేసుల్లో సాయిరెడ్డి అప్రూవర్‌గా మారితే శిక్ష తీవ్రత తగ్గుతుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ చేసిన అవకతవకలను తిరగదోడడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో కాకినాడ పోర్టు, సెజ్‌ల వివాదం బయటకు వచ్చింది. సీఐడీ, ఈడీ కేసు నమోదు చేయడం, విచారించడం జరుగుతోంది. ఈ వ్యవహారంపై తెరవెనుక అంతా జగన్ చేయించారని నిందితులు పేర్కొన్నట్లు మరోవైపు ప్రచారం లేకపోలేదు.
జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షాలు తారుమారు, దాచిపెట్టారనే అభియోగం తప్పితే విజయసాయిరెడ్డిపై మరేమీ లేదు. తాను అప్రూవర్‌గా మారితే పోయిదేమీ లేదని ఢిల్లీ సర్కిల్స్‌లో కొందరు జర్నలిస్టులో ఆయన పలుమార్లు చెప్పారు కూడా. ఈ లెక్కన అక్రమాస్తుల కేసులో ఆయన అప్రూవర్‌గా మారితే జగన్ ఇరుక్కుపోవడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
మరోవైపు సాయిరెడ్డి రాజీనామాపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయమన్నారు. జగన్ డిస్ క్వాలిఫై అవడం ఖాయమన్నారు. ఈ లెక్కన పులివెందులకు ఉప ఎన్నికలు వస్తున్నాయని మనసులోని మాట బయటపెట్టారు. జగన్‌ను ఎవరూ కాపాడలేరని, పార్టీలో ఆయనొక్కరే మిగులుతారని ఎద్దేవా చేశారు.
మరోవైపు కొద్దిరోజుల కిందట జగన్ కేసు వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఆయన పిటిషన్ పరిగణనలోకి తీసుకుంది న్యాయస్థానం. ఈ కేసు విచారిస్తున్న ఇద్దరు సభ్యులను తప్పించి బీవీ నాగరత్నం, సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి అప్పగించింది. ఆ సమయంలో జగన్‌కు కష్టాలు తప్పవనే ప్రచారం హస్తినలో టాక్ నడిచింది కూడా.