జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది గుర్తుతెలియని అనారోగ్యం కారణంగా కన్నుమూయడం సంచలనంగా మారింది. తాజాగా మరో బాలుడు కూడా కన్నుమూడయంతో కేంద్రం అప్రమత్తమైంది. అసలేం జరుగుతోందో తేల్చేందుకు మంత్రుల బృందం ఒకటి రాష్ట్రానికి చేరుకుంది.
బఢాల్ గ్రామంలో ఈ మరణాలు సంభవించాయి. అంతుచిక్కని వ్యాధి కారణంగా యాస్మీస్ కౌసర్ చివరి సంతానం ముహ్మద్ అస్లమ్ కూడా ఎస్‌ఎమ్‌జీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అంతుకుముందు అతడి ఐదురుగు సంతానం కూడా ఇదే అంతుచిక్కని వ్యాధి బారిన పడి కన్నుమూశారు. ఇక కౌసర్ సోదరులు ఐదురుగు, వారి అమ్మమ్మ తాతయ్యలు కూడా గతవారమే అనారోగ్యంతో కన్నుమూశారు. గతేడాది డిసెంబర్ 7 నుంచి 12 ఈ కుటుంబాల్లోని 9 మంది మరణించగా తాజాగా మృతుల సంఖ్య 17కు చేరింది. జ్వరం, కడుపులో తిప్పడం, ఒళ్లు నొప్పులు తదితర సాధారణ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన బాధితులు ఆ తరువాత కొన్ని వారాలకే కన్నుమూశారు. వారి అనారోగ్యం ఏమిటనేది వైద్యులకు కూడా మిస్టరీగా మారింది.
ఘటనపై దృష్టిసారించేందుకు మంత్రులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్టు గత శనివారం హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాగా, శనివారం కేంద్ర బృందం రాజౌరీ జిల్లా కేంద్రానికి చేరుకుంది. సోమవారం బాధితుల గ్రామాన్ని సందర్శిస్తుందని అధికారులు పేర్కొన్నారు. స్థానిక అధికారుల సాయంతో కేంద్ర బృందం ఈ అంతుచిక్కని వ్యాధికి గల కారణాలు పసిగట్టేందుకు ప్రయత్నిస్తుంది. వీరితో పాటు దేశంలోని ప్రతిష్ఠాత్మక వైద్ సంస్థలకు చెందిన నిపుణులను కూడా కేంద్రం రంగంలోకి దించింది.
కాగా, ఈ పరిణామాలపై జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఇటీవల స్పందించింది. రోగుల నుంచి శాంపిళ్లను వైద్యులు పరీక్షించారని, ఇప్పటివరకూ ఉన్న ఆధారాలను బట్టి ఇది అంటు వ్యాధిగా తాము భావించట్లేదని తెలిపారు. ఇది బ్యాక్టీరియా, లేదా వైరస్ వల్ల సంభవించిన మరణాలుగా అనిపించట్లేదని అన్నారు. ఇది ప్రజారోగ్య సమస్యగా మారే అవకాశం ప్రస్తుతానికైతే లేదని భరోసా ఇచ్చారు. ఇక ఈ మరణాలకు సంబంధించి ఇతర కోణాల్లో దర్యాప్తు చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
ఇక ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. మరణాల సంఖ్య అంతకంతూ పెరుగుతుండటం ఆందోళన కరమని వ్యాఖ్యానించారు. అంతుచిక్కని అనారోగ్యానికి గల కారణాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈ సమస్య మూలాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ శాఖలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని అన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, డిసెంబర్ 7న ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు ఓ విందుకు హాజరైవచ్చాక అనారోగ్యం పాలయ్యారు. వారిలో ఐదుగురు మరణించారు. డిసెంబర్ 12న వారి బంధువుల్లో తొమ్మిది మంది అనారోగ్యం పాలయ్యారు. వారిలో ముగ్గురు కన్నుమూశారు. ఇక జనవరి 12న ఒక కుటుబానికి చెందిన వారు మరో విందుకు హాజరై వచ్చాక అనారోగ్ం పాలయ్యారు. వీరిలో కూడా కొందరు కన్నుమూయడంతో మొత్తం మరణాల సంఖ్య 17కు చేరింది.