బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుల్ని పట్టుకునేందుకు ముంబై పోలీసులు శతవిధాలా ప్రయత్నించి చివరికి శనివారం అర్ధరాత్రి థానేలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం డీసీపీ దీక్షిత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేసులు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.
“జనవరి 16 తెల్లవారుజామున రెండు గంటలకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. 30 ఏళ్ల మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడుగా గుర్తించాము. నిజానికి దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఇంట్లోకి చొరబడ్డాడు. ప్రస్తుతం అతన్ని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతున్నాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ సైతం చేపడుతాం. ప్రాథమిక విచారణలో అతడు బంగ్లాదేశ్ వ్యక్తిగా గుర్తించాము. అసలు మహమ్మద్ భారత్ లోకి ఎలా చొరబడ్డాడు? అక్రమంగా చొరబడ్డాడా? లేక దీని వెనక మరెవరైనా హస్తం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టాం. నిందితుడు భారత్ లోకి ఎలా వచ్చాడు అనే కోణంలో సైతం విచారణ జరుగుతుంది. అక్రమంగా భారత్ లోకి చొరబడి ఆరు నెలల నుంచి ముంబైలోనే తిరుగుతున్నాడు. భారతీయుడని చెప్పడానికి అతని దగ్గర సరైన ఆధారాలు లేనప్పటికీ.. కొన్నాళ్లుగా దేశంలో చలామణి అవుతున్నాడు.. ” అంటూ డీసీపీ తెలిపారు.
ఇక గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగులు ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. సైఫ్ చిన్న కొడుకు జేహ్ గదిలోకి దుండగుడు ప్రవేశించగా గమనించిన కేర్ టేకర్ కేకలు వేయడంతో సైఫ్ అక్కడికే చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పెనుగులాట జరగటంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని లీలావతి హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఆయన క్షేమంగానే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి హాస్పిటల్ లో కోలుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మూడు రోజుల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ దాడి జరిగినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని దీని వెనక ఏవరిదో హస్తం ఉందని వార్తలు సైతం వినిపిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు పోలీసులు నిందితుల్ని పట్టుకోవడంతో అతడు బంగ్లాదేశ్ వ్యక్తిగా తేలింది. అయితే అతడు సైఫ్ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడు? ఎలా ప్రవేశించాడు? ఇలాంటి విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పాటు కేవలం సైఫ్ ఇంటికి వెళ్లడం వెనక ఉన్న ఉద్దేశంతో పాటు ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నారు? అతడిని సైఫ్ ఇంటికి చేర్చిన వ్యక్తి ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులకు విచారణ మరింత వేగవంతం చేయనున్నారు.