UPDATES  

NEWS

 వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై అసెంబ్లీలో సర్కార్ ప్రకటన..!

ఏపీలో వైజాగ్ మెట్రోప్రాజెక్టు నిర్మాణంపై ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైజాగ్ మెట్రో వివరాలు వెల్లడించారు. విశాఖ‌ప‌ట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక‌(సీఎంపి)సిద్దం చేసిన‌ట్లు నారాయ‌ణ తెలిపారు. ఈ ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టికే కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తామ‌న్నారు.

 

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం విజ‌య‌వాడ‌,విశాఖ‌కు మెట్రో రైలు పై ఫీజిబులిటీ రిపోర్ట్ ఇవ్వాల‌ని ఉందని, దీంతో 2014లో డీపీఆర్ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ కు అప్పటి టీడీపీ ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు అప్ప‌గించిందని మంత్రి నారాయణ తెలిపారు. 2015లో డీఎంఆర్సీ ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. వైజాగ్ లో 42.5 కిమీల నెట్ వ‌ర్క్ తో మూడు కారిడార్ల‌తో మీడియం మెట్రో ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు ఇచ్చారన్నారు. దాన్ని తర్వాత వైసీపీ ప్రభుత్వం పక్కనబెట్టి మరో కంపెనీతో నాలుగు కారిడార్ల కోసం డీపీఆర్ తీసుకుందన్నారు.

 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ల‌క‌త్తా మెట్రో రైల్ త‌ర‌హాలో వంద‌శాతం కేంద్ర‌ప్ర‌భుత్వం భ‌రించేలా రైల్వే శాఖ‌కు అప్ప‌గించేలా కేంద్రానికి ప్ర‌తిపాద‌నలు చేశామన్నారు. మొద‌టి ద‌శ‌లో 46.23 కిమీ మేర మూడు కారిడార్ల‌లో నిర్మాణం చేస్తామ‌న్నారు. మొద‌టి కారిడార్ ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్ష‌న్ వ‌ర‌కూ 34.4 కిమీ మేర, రెండో కారిడార్ లో గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వ‌ర‌కూ 5.07 కిమీ మేర, మూడో కారిడార్ లో తాటిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వ‌ర‌కూ 6.75 కిమీ మేర ప్రాజెక్ట్ నిర్మాణం చేప‌ట్టేలా ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసామ‌న్నారు.

 

మొత్తంగా 46.23 కిమీ మేర 42 స్టేష‌న్ల‌తో నిర్మించే ప్రాజెక్ట్ కు 11,498 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచనా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రెండో ద‌శ‌లో కొమ్మాది జంక్ష‌న్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వ‌ర‌కూ 30.67 కిమీ మేర 12 స్టేష‌న్ల తో మెట్రో నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసామ‌న్నారు. అయితే విశాఖ మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్ వ‌స్తున్న అంశాన్ని కూట‌మి నేతలు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చార‌న్నారు మంత్రి….ప్ర‌తి క్రాసింగ్ వ‌ద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా కార్ షెడ్,ఎండాడ‌,హ‌నుమంతుని వాక‌,మ‌ద్దిల‌పాలెం,విప్రో జంక్ష‌న్,గురుద్వారా,అక్క‌య్య‌పాలెం,తాటిచెట్ల‌పాలెం,గాజువాక‌,స్టీల్ ప్లాంట్ జంక్ష‌న్ ల వ‌ద్ద టూ లెవ‌ల్ మెట్రో,ఫ్లై ఓవ‌ర్ లు నిర్మించే ప్ర‌తిపాద‌న కూడా చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |