UPDATES  

NEWS

 బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్.. నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేయవద్దని ఆదేశాలు.m

బుల్డోజర్ చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. కూల్చివేతకు 15 రోజుల ముందు భవన యజమానికి నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించాల్సిందేనని పేర్కొంది. రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపడంతో పాటు నిర్మాణం వెలుపల నోటీసులు అంటించాలని తెలిపింది.

 

ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చేస్తున్నదీ స్పష్టమైన కారణం తెలపాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కూల్చివేతను వీడియో తీయాలని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజ్యాంగ పరిరక్షణకు పౌర హక్కుల పరిరక్షణ చాలా అవసరమని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా చట్ట నియమాలు తప్పనిసరని, చట్టపరమైన ప్రక్రియ అటువంటి చర్యను క్షమించదని స్పష్టం చేసింది.

 

ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో ఏళ్ల శ్రమ, కలలు కలగలిపి ఉంటాయని, వారి భవిష్యత్తు, భద్రత కూడా అందులోనే ఉంటుందని కోర్టు పేర్కొంది. నిందితుడు ఒక్కడే అయినప్పుడు ఆ ఇంట్లో నివసించే మిగతా వారికి ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించింది.

 

కార్యనిర్వహణ అధికారే న్యాయమూర్తి పాత్ర పోషించి చట్టాన్ని పాటించకుండా ఇంటి కూల్చివేతకు ఆదేశాలిస్తే అది రూల్ ఆఫ్ లాను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. కూల్చివేతల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్టు రుజువైతే పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల వేతనం నుంచి వసూలు చేస్తామని తెలిపింది. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత వెబ్‌సైట్‌లో నోటీసులను ప్రదర్శించాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, నోటీసులను తప్పకుండా రిజిస్టర్డ్ పోస్టులోనే పంపాలని పేర్కొంది.

 

అసలేంటీ బుల్డోజర్ న్యాయం?

ఇటీవలి కాలంలో దేశంలో బుల్డోజర్ న్యాయంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. తొలుత ఇది ఉత్తరప్రదేశ్‌లో మొదలైంది. నేరగాళ్లలో భయం పెంచేలా నిందితుల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులను బుల్డోజర్‌తో కూల్చివేస్తున్నారు. ఈ న్యాయంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. సుప్రీంకోర్టు కూడా దీనిని తప్పుబట్టింది. ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటమే అవుతుందని స్పష్టం చేసింది. అయితే, రహదారులు, ఫుట్‌పాత్‌లు, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల విషయంలో ఇది వర్తించదని తేల్చి చెప్పింది. ప్రజల నివాసాల రక్షణ, భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయని, వాటిని కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. యూపీలో మొదలైన ఈ బుల్డోజర్ న్యాయం ఆ తర్వాత పలు రాష్ట్రాలకు పాకింది. ఇటీవల తెలంగాణలో ఇది విపరీత చర్చకు దారితీసింది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |