తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి.
కాగా, అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులకు సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మందికిపైగా హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫలితాలను విడుదల చేశారు. కాగా, గ్రూప్ 1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 3 గంటల వ్యవధిలో 150మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్షల షెడ్యూల్ ఇలా..
అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ ) 22న పేపర్-1 (జనరల్ ఎస్‌ఏ) 23న పేపర్-2 (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) 24న పేపర్ -3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) 25న పేపర్ -4 (ఎకానమీ, డెవలప్మెంట్) 26న పేపర్- 5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇన్టర్ప్రెటేషన్ 27న పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం)
మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్ తప్ప, మిగిలిన పేపర్లను అభ్యర్థలు ఎంచుకున్న భాషలో రాయాల్సి ఉంటుంది.