త్వరలోనే ఏపీలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఈనెల 23న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
దీపావళికి ఉచిత గ్యాస్…
ఈ క్రమంలోనే పలు కీలక అంశాలపై చర్చలు చేయనున్న క్యాబినెట్, అనంతరం వాటిని ఆమోదించి నిర్ణయాలు తీసుకోనుంది. ఇక సూపర్ సిక్స్ పథకంలోని ఫ్రీ కుకింగ్ గ్యాస్ స్కీమ్, దేవదాయ శాఖకి సంబంధించి మరిన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 23న బుధవారం జరిగే కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహిళలకు ఫ్రీ బస్సు…
దీపావళి ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఇదే సమయంలో పండగ తర్వాత మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని సైతం ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇక దేవాదాయ శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలు, ఇతర అంశాలపైనా చర్చలు చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్‌పై రిజిస్ట్రేషన్ రుసుంల మినహాయింపు, చెత్త పన్ను రద్దు, 13 కొత్త పురపాలికల్లో దాదాపుగా 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.