కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో సోమవారం అర్ధరాత్రి అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సుమారు 100 మంది వ్యక్తులు రెండు జేసీబీలతో వచ్చి ఒక ఇంటిని నేలమట్టం చేశారు. బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం, రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోతున్న మహిళలు, చిన్నారులు, వృద్ధులను బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు లాగి పడేశారు. కనీసం సామాన్లు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇంటిని కూల్చివేశారని, ఈ క్రమంలో మహిళల మెడలోని మంగళసూత్రాలను కూడా లాక్కున్నారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ దౌర్జన్యం వెనుక స్థానిక ఎమ్మెల్యే బంధువుల హస్తం ఉందని బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి, లక్ష్మారెడ్డి అనే వ్యక్తులు సుమారు 12 సెంట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. సెంటు భూమి సుమారు 50 లక్షల వరకు విలువ చేస్తుందని, న్యాయపరంగా ఎదుర్కోలేక ఇలా అర్ధరాత్రి వేళ గూండాలతో వచ్చి తమను నిరాశ్రయులను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వందేళ్లుగా తాము అక్కడే నివసిస్తున్నామని, దళితులమైన తమపై ఇలాంటి దాడి చేయడం దారుణమని వారు వాపోయారు.
ప్రస్తుతం బాధితులు తమ చిన్నారులతో సహా రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. “పవన్ కళ్యాణ్ అన్నా.. ఒక్కసారి మాతో మాట్లాడు, మాకు నువ్వే న్యాయం చేయాలి” అంటూ వారు డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు రోడ్డు పైనుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్యుల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.









