ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో జమిలి దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా చండీఘడ్ లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. జమిలి ఎన్నికల ప్రస్తావన వేళ పాలనలో వేగం పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బడ్జెట్ ప్రతిపాదనలు
ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. దీని పైన రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. దీంతో.. పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కారణంగా గత వైసీపీ ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కూటమి ప్రభుత్వం సైతం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రతిపాదించింది. ఇక, ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అసెంబ్లీ అధికారులకు ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి.
హామీల అమలు
కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్దిక పరిస్థితుల పైన పూర్తి అధ్యయనం తరువాతనే బడ్జెట్ ప్రతిపాదించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జూలైలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కీలక రంగాల పైన శ్వేత పత్రాలు విడుదల చేసారు. ఈ సారి బడ్జెట్ లో ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కేటాయింపులు చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం ముగిసే లోగా తల్లికి వందనం అమలు చేయాలని.. ఇందు కోసం రూ 12 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల పైన బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
కసరత్తు
ప్రభుత్వం ఈ సారి 2.90 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అదే విధంగా సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం తో పాటుగా తల్లికి వందనం అమలు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అదే విధంగా ప్రభుత్వం బడ్జెట్ లో తమ ప్రాధాన్యత అంశాల పైన స్పష్టత ఇవ్వనుంది. దీంతో..ఆర్దిక శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.