శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని పద్మావతి ఆసుపత్రిలో ఘోర కలి జరిగింది. ఎన్పీ కుంట మండలం జౌకల గ్రామానికి చెందిన హరిణి అనే గర్భిణి ప్రసవం కోసం వారం క్రితం ఈ ఆసుపత్రిలో చేరింది. అయితే, మంగళవారం తెల్లవారుజామున హరిణితో పాటు ఆమె జన్మనిచ్చిన ఆడబిడ్డ కూడా మృతి చెందారు. వైద్యులు సరైన సమయంలో స్పందించకపోవడం, చికిత్సలో నిర్లక్ష్యం వహించడం వల్లే తన భార్య, బిడ్డ ప్రాణాలు కోల్పోయారని మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు, సీపీఐ నాయకులు మరియు ప్రజా సంఘాలతో కలిసి ఆసుపత్రి ముందు భారీ ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీనివల్ల కదిరి పట్టణంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.









