హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ కు ఆధిక్యం లభించినా ఆ తర్వాత మాత్రం బీజేపీ దూసుకుపోతోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధుల ఆధిక్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ మరోసారి హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైనట్లే భావిస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా హర్యానాలో బీజేపీ విజయానికి కారణమైన ఓ వ్యూహంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
హర్యానాలో రైతులు, సైనికులు, రెజ్లర్లు ఇలా మూడు వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. అలాగే రాష్ట్ర జనాభాలో దాదాపు 27 శాతం ఉన్న జాట్లు ప్రధానంగా కాషాయ పార్టీని వ్యతిరేకించారు. దీంతో బీజేపీ ఓటమి ఖాయంగా కనిపించింది. అయితే కుల సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉండే హర్యానాలో బీజేపీ మాత్రం ఆశలు వదులుకోలేదు. జాట్లకు వ్యతిరేకంగా ఉన్న మిగతా కులాల్ని ఏకీకరణ చేయగలిగితే కచ్చితంగా ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఇదే 35-1 వ్యూహం.
జాట్లకు వ్యతిరేకంగా హర్యానాలో ఏకంగా 35 కులాల్ని ఏకం చేసేందుకు, తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ భారీ వ్యూహం రచించింది. ఆయా కులాల నేతలతో మాట్లాడి వారిని పూర్తిగా తమవైపు తిప్పేసుకుంది.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాట్లు, దళితులు, ముస్లింలను మాత్రమే నమ్ముకుంది. దీంతో సహజంగానే జాట్లు మినహా మిగతా కులాలు బీజేపీకి అండగా నిలిచినట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో హర్యానాలో జాట్ల ఆధిపత్యానికి గండి పడొచ్చని భావిస్తున్నారు.