మూడు విడతలుగా నిర్వహించిన జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. దశాబ్దం తర్వాత ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటరు ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ జోడీకే జై కొట్టాడు.
90 సీట్ల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ అయిన 46 సీట్లను ఇండియా కూటమి ఇప్పటికే సాధించింది. 50 సీట్లలో కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీకి ఇక్కడ రెండో స్ధానం దక్కేలా ఉంది.
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి 47 నుంచి 50 సీట్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాశ్మీర్ లోయతో పాటు జమ్మూలోనూ ఇండియా కూటమి మంచి ఫలితాలు రాబట్టేలా కనిపిస్తోంది. ఈ కూటమి తరఫున సీఎం అభ్యర్ధిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన రెండు స్ధానాలు గందేర్ బల్, బుద్గాంలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు జమ్మూ ప్రాంతంలో ఓటర్లను నమ్ముకుని బరిలోకి దిగిన బీజేపీకి అందుకు తగ్గట్టే ఫలితాలు లభిస్తున్నాయి. బీజేపీ ప్రస్తుతం 29 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్ధానంలో పీడీపీ కేవలం 4 సీట్లలోనే ముందంజలో ఉంది. ఇందులోనూ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేసిన రెండు సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు మరో 8 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తో పాటు పలువురు స్థానిక పార్టీల అధినేతలు, నాయకుల్ని నెలల తరబడి కేంద్రం గృహనిర్భంధంలో ఉంచింది. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సైతం కాశ్మీర్ కు వెళ్లకుండా పలుమార్లు అడ్డుకుంది. దీని ఫలితం ఎన్నికల ఫలితాలపై కనిపిస్తోంది. అలాగే ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని రూపుమాపుతామన్న బీజేపీ హామీ కూడా నెరవేరకపోవడం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినట్లు అర్థమవుతోంది.