UPDATES  

NEWS

 అభివృద్ధిలో రాజకీయాల్లేవ్.. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు, పార్టీలకతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూపొందించిన నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంస్ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు మెరుగైన ఉపాధిని కల్పించటంతో బాటు రాబోయే రోజుల్లో తెలంగాణను ఉత్తమ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ఈ నూతన పాలసీ దోహదపడనుందని, అందుకే MSME లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

 

అభివృద్ధే లక్ష్యంగా..

తెలంగాణను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగానే తమ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు. తొంభైయ్యవ దశకంలో దేశ ఆర్థికస్థితి దారుణంగా దెబ్బతిన్న సమయంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దూరదృష్టితో ఆలోచించి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారని, ఆయన చొరవ ఫలితంగానే దేశ వ్యాప్తంగా లైసెన్స్ రాజ్ వ్యవస్థ రద్దై, పారిశ్రామికవేత్తలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని దేశ పారిశ్రామిక రంగం ముందుకు పోవటమే గాక భారత్.. మిగతా ప్రపంచంతో పోటీ పడే వాతావరణం ఏర్పడిందన్నారు. ఇదే రీతితో, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు నూతన పాలసీ కోసం చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. స్పష్టమైన పాలసీ డాక్యుమెంట్, కార్యాచరణ లేకుండా ఏ రాష్ట్రమూ ముందుకు పోలేదన్నారు. గత ప్రభుత్వాలు ప్రతిపాదించిన మేలైన విధానాలను కొనసాగిస్తూనే, ఈ కాలానికి అవసరమైన విధానాలను ఈ పాలసీలో చేర్చామన్నారు. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, ఏ పార్టీ ప్రభుత్వం అనే తేడాలు చూపకుండా దానిని ముందుకు తీసుకుపోతేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

 

యువతకు ఉఫాధి..

తమ పార్టీ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించేందుకు చొరవ తీసుకుంటోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గత పాలకుల మంచి పనులను కొనసాగిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే వాటిని సమీక్షిస్తున్నామన్నారు. ఈ రోజుల్లో చదువులకు, మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలకు మధ్య అంతరం ఉన్నందునే, మన యువత తమ అర్హతకు తగిన కొలువులు పొందలేకపోతున్నారని, ఆ గ్యాప్‌ను పూడ్చేందుకే స్కిల్ వర్సిటీని తీసుకొస్తున్నామని, ఈ వర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తల భాగస్వామ్యంతో రూ. 300 నుంచి రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు తగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు రాష్ట్రంలోని 65 ఐటీఐలను రూ. 2400 కోట్లు వెచ్చించి, టాటా సంస్థ భాగస్వామ్యంతో అడ్డాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించామన్నారు. ఇవేవీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని పేర్కొన్నారు.

 

అగ్రికల్చర్.. మన కల్చర్..

ప్రస్తుత యుగంలో వ్యవసాయం లాభసాటిగా లేదనే కారణంతో తెలంగాణలోని రైతన్నలు వ్యవసాయాన్ని వదలవద్దని, తమ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని దండగ కాదు.. పండగ అని నిరూపించబోతోందన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు వంటి వాటిని అందించి రైతులకు అండగా ఉంటామని, ఇదే సమయంలో వ్యవసాయంతో బాటు అనుబంధ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అభిప్రాయపడ్డారు. ‘అగ్రికల్చర్ అనేది మన కల్చర్. కనుక రైతులు సాగు చేస్తూనే, తమ కుటుంబ సభ్యులను వ్యాపార మార్గాల దిశగా ప్రోత్సహించండి’ అని విజ్ఞప్తి చేశారు.

 

ఫ్యూచర్ సిటీ రాకతో..

రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ రాకతో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా విలేజ్‌లు రానున్నాయని, కాలుష్యానికి అవకాశం లేని ఈ సంస్థల రాకతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని సీఎం వివరించారు. కాలుష్య కాసారంగా మారిని మూసీని ప్రక్షాళన చేసి సబర్మతి నదిలా తీర్చి దిద్దుతామన్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా పాలన చేస్తున్నామని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నంలో భాగంగా వారికి వడ్డీలేని రుణాలు, శిల్పారామంలో 3 ఎకరాల స్థలంలో డ్వాక్రా బజార్ ఏర్పాటు, అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతలు, సర్కారు బడి పిల్లల యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు ఇచ్చామన్నారు.

 

ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం..

‘రాబోయే రోజుల్లో తెలంగాణను ఒక ట్రిలియన్ ఎకానమీగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందనీ, ఈ క్రమంలోనే ఎంఎస్‌ఎంఈల్లో సరికొత్త టెక్నాలజీని ఆహ్వానిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఈ రంగాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలనే అంశంపై ఈ రంగానికి చెందిన 120 మంది నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజధానితో బాటు జిల్లా కేంద్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పలు ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక వసతులతో ప్లాట్ ఫ్యాక్టరీస్‌ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందటం, కొత్త పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించటం ద్వారా రాబోయే రోజుల్లో మన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి అయ్యే పరిస్థితిని తీసుకొస్తామన్నారు.

 

రాహుల్ ఆలోచనే ప్రేరణ.. : భట్టి

నేడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీ రూపకల్పన వెనక విపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పలు కారణాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని, ఈ పరిస్థితిని తెలంగాణ అనుకూలంగా మలచుకోగలిగితే, రాష్ట్రం మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతుందన్నారు. తెలంగాణలో దాదాపు రూ. 80వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు బహుళ జాతి కంపెనీలు ముందుకొచ్చాయని, ఆ పరిశ్రమల పారిశ్రామిక అవసరాలను నూతన ఎంఎస్‌ఎంఈలు తీర్చనున్నాయని వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |