ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండగ సందర్భంగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్నారు.
మహాశక్తి పథకం కింద ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. మరోవైపు, అభివృద్ధి పనులను స్ట్రీమ్ లైన్ చేస్తామని చంద్రబాబు తెలిపారు.
వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 350 కోట్లు వచ్చాయని వెల్లడించారు. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని పిలుపునిచ్చారు చంద్రబాబు. బుడమేరు కబ్జాలకు గురికావడంతోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చిందన్నారు. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చామని వివరించారు.
కోట్లాది మంది ప్రజలు కూటమిపై ఆశలు పెట్టుకున్నారని.. ప్రతి అడుగు ఆలోచించి వేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజలు ఇంతటి నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులు చేయొద్దన్నారు. కక్ష సాధింపులకు దిగవద్దన్నారు. కక్ష సాధింపు చేయాలంటే ముందుగా తానే చేయాలని.. కానీ, అది మన విధానం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు మూడు పార్టీల మధ్య ఉన్న సమన్వయం అద్భుతమని.. ఈ వంద రోజుల్లో కూడా అదే సమన్వయంతో పనిచేశారని చంద్రబాబు ప్రశంసించారు. నరేగా నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయవచ్చన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం కారణంగా అనేక నీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని అన్నారు. తాము వచ్చాక నీటి ప్రాజెక్టులను బాగు చేస్తున్నామని తెలిపారు.