ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసు కొత్త మలుపు తిరుగుతుందా? ఈ వ్యవహారంలో మరో ఐఏఎస్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారా? ఆయనతోపాటు ఓ సలహాదారు ఉన్నారా? మరో ఐపీఎస్ అప్రూవర్‌గా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? పోలీసు ఉన్నతాధికారులకు ఆయన వర్తమానం పంపించారా? అవుననే సమాధానం వస్తోంది.
వైసీపీకి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం 100 రోజులు మాత్రమే పూర్తి చేసుకుంది. ఇంకా నాలుగేళ్ల 9 నెలల సమయం ఉంది. నమ్మి వచ్చినందుకు పార్టీ తమను నట్టేట ముంచిందంటూ కొందరు నేతలు ఆ పార్టీకి రాంరాం చెప్పేస్తున్నారు. ఫ్యాన్‌తో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నారు.
ఇంకోవైపు ఇష్టానుసారంగా రెచ్చిపోయిన కొందరు నేతలపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇలా ఒకదాని వెనుక మరొకటి ఆ పార్టీని వెంటాడుతున్నాయి.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు సినిమా మాదిరిగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ కేసులో తీగలాగిన కొద్దీ డొంక కదులుతోంది. ఇప్పటి వరకు ఐపీఎస్‌లు కీలకంగా మారగా, తాజాగా మరో ఐఏఎస్ ప్రమేయమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆయన ఆలోచనతో ఇదంతా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు సీఎంవోలో ఆయన కీలకంగా వ్యవహరించారట. ఆయన వెనుక ఓ సలహాదారు కూడా ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఆయనకు సంబంధించిన కొంత సమాచారం పోలీసుల వద్దనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట.
ఇదిలావుండగా ఐపీఎస్ అధికారి విశాల్‌గున్నీ అప్రూవర్‌గా మారేందుకు కొంత సమాచారం ఇచ్చారని అంటున్నారు. విశాల్ దారిలో మరో ఐపీఎస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
అదే జరిగితే ఈ కేసు వ్యవహారం ఓ కొలిక్కిరావడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో ఐఏఎస్, సలహాదారుని నిందితులుగా చేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అధికారులకు ప్రమోషన్లు, పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు ముట్టినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.