తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఎక్కువగా జారీ చేయకపోవడంతో చాలా మంది అర్హులు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే గతేడాది చివరలో ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డులకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది.
దీంతో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. న్యూ రేషన్ కార్డులకు సంబంధించి సెప్టెంబర్ 16న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. సబ్ కమిటీ భేటీ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రకటన చేశారు.
కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. ఎవరు తెల్ల రేషన్ కార్డుకు అర్హులనేది వచ్చే సమావేశంలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారు అనేది కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని వివిధ పార్టీలకు లేఖలు కూడా రాసినట్లు వారు మీడియాకు తెలిపారు. కొంత మంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకుని విధివిధానాలు రూపొందిస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం తెలంగాణలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 6 కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నట్లు గుర్తు చేశారు.గత ప్రభుత్వం 10 ఏళ్లలో కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని ఉత్తమ్ ఆరోపించారు. సెప్టెంబర్ 21న కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.









