జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు నిర్వహించడం ఈసీకి సైతం సవాలుగా మారింది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలోని 90 సీట్లకు మొత్తం మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 18, 25వ తేదీల్లో, వచ్చే నెల 1న పోలింగ్ జరగనుంది. 18న జరిగే తొలి దశలో 24 సీట్లకు, 25న జరిగే రెండో దశలో 26 సీట్లకు, అక్టోబర్ 1న జరిగే మూడో దశలో 40 సీట్లకు పోలింగ్ జరగబోతోంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. దీంతో ఈ మూడు విడతలకు భద్రత కల్పించడం బలగాలకు సవాలుగా మారింది.
గతంలో జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో దాడుల భయంతో ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారు కాదు. ఈసారి ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారిన పరిస్ధితుల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం కూడా భద్రతా బలగాలకు సవాలుగానే కనిపిస్తోంది. కశ్మీర్లో ప్రజలు సురక్షితంగా ఉన్నారని బీజేపీ చెబుతుంటే స్థానిక పార్టీలతో పాటు కాంగ్రెస్ మాత్రం అమర్ నాథ్ యాత్రికులకు సైతం భద్రత కల్పించాల్సి వస్తోందని గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోలింగ్ జరిగే తీరును బట్టి ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో తేలిపోనుంది.