ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ విధించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేశారని మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం ఈ మేరకు తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది.
కేంద్ర సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని, ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపించింది. కాగా, మధుసూదన్ రెడ్డి హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.
మధుసూదన్ రెడ్డిపై విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం రైల్వే బోర్డు చైర్మన్ కు లేఖ రాసింది. ఫైబర్ నెట్ లో అక్రమాలపై విచారణ జరుగుతోందని, ఈ విచారణకు మధుసూదన్ రెడ్డి అందుబాటులో ఉండడం కోసం, ఆయన డిప్యుటేషన్ ను మరో ఆరు నెలలు పొడిగించాలని రైల్వే బోర్డును కోరింది.
ఏపీలో మధుసూదన్ రెడ్డి డిప్యుటేషన్ ఆగస్టు 22తో ముగియనుంది. ఆయన 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. అయితే, ఫైబర్ నెట్ లో అక్రమాలపై విచారణ నేపథ్యంలో, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ఆయనపై విచారణ జరుగుతున్న విషయాన్ని రైల్వే బోర్డుకు వివరించింది.
మరోవైపు… ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్ రెడ్డి డిప్యుటేషన్ ను పొడిగిస్తూ భారత కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది. కోస్ట్ గార్డ్ నుంచి ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన వెంకట్ రెడ్డిపై కూడా అవినీతి సంబంధిత ఆరోపణలపై విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం లేఖకు కోస్ట్ గార్డ్ స్పందిస్తూ… ఈ నెల 31 వరకు వెంకట్ రెడ్డి డిప్యుటేషన్ పొడిగించినట్టు ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో వెల్లడించింది. అంతేకాదు, వెంకట్ రెడ్డి అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని కోస్ట్ గార్డ్ కార్యాలయం పేర్కొంది.
సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఈ నెల 31న వెంకట్ రెడ్డి పదవీవిరమణ చేయనున్నారని వివరించింది. తదుపరి చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలని సీఎస్ కు రాసిన లేఖలో కోస్ట్ గార్డ్ స్పష్టం చేసింది.
ఇసుక, గనుల శాఖలో అక్రమాలపై వెంకట్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.