కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అడుగడుగునా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారట. ఆసుపత్రికి మందులు, ఇతరత్రా వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్టుల్లో 20 శాతం కమీషన్ ఆయనకు ఇచ్చుకోవాల్సిందేనట. రోగులకు ఇంజెక్షన్ చేసిన సిరంజీలను, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారట. అంతేనా, చివరకు అనాథ శవాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని సందీప్ ఘోష్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అవినీతిపై విచారణ చేపట్టిన సిట్ బృందం వీటన్నిటిపైనా దర్యాఫ్తు చేస్తోంది. సిట్ విచారణలో ఒక్కొక్కటిగా సందీప్ అక్రమాలు బయటపడుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో సందీప్ ఘోష్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
గతంలోనే ఫిర్యాదులు..
సందీప్ ఘోష్ అవినీతికి సంబంధించి గతంలోనే డాక్టర్ అక్తర్ అలీ ఫిర్యాదు చేశారు. అయితే, విచారణ మాత్రం జరగలేదు. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం అక్తర్ ను విచారణకు పిలిచింది. ఆయన ఫిర్యాదుతో సందీప్ పై కేసు నమోదు చేసింది. అక్తర్ అలీ గతేడాది వరకు ఆర్జీ కర్ ఆసుపత్రిలోనే పనిచేశారు. ప్రస్తుతం ఆయన ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సందీప్ అక్రమాలు స్వయంగా చూశాక అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అక్తర్ చెప్పారు.
సందీప్ బంగ్లాదేశ్ కు మందులు ఎగుమతి చేస్తున్నారని, కమీషన్ పుచ్చుకుని కాంట్రాక్టులు కట్టబెట్టేవారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు అప్పట్లోనే తాను ఓ లేఖ రాసినట్టు సిట్ అధికారులకు చెప్పారు. ఆసుపత్రి ఆస్తులను తన సొంత ఆస్తుల్లాగా లీజుకు ఇచ్చేవారని, మందుల సరఫరా కాంట్రాక్టులను సందీప్ ఘోష్ తన బంధుమిత్రులకు కట్టబెట్టేవారని మండిపడ్డారు. పరీక్షల్లో ఫెయిలైన వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకునే వారని అన్నారు. అనాథ శవాలను అమ్ముకునే వారని, ఆసుపత్రిలో పోగయ్యే వ్యర్థాలను రీసైక్లింగ్ చేయించి సొమ్ము చేసుకునేవారని అక్తర్ అలీ ఆరోపించారు.