కోల్ కత్తా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల వైద్యురాలు ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురై మృతి చెందిన కేసులో ఇప్పటికే ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా వైద్యురాలి మృతికి నిరసనగా ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి.
మృతురాలి శరీరంపై 14కు పైగా గాయాలు
మరోవైపు ఈ కేసును సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇక ఇదే సమయంలో కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల వైద్యురాలి మృతికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్ సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా బయటకు వచ్చిన ఈ పోస్ట్ మార్టం రిపోర్టులో బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు మరియు జననాంగాలలో 14 పైగా గాయాలు ఉన్నాయని పేర్కొంది.
మరణానికి కారణం ఇదే
లైంగిక వేధింపులకు గురి చేసినట్టు స్పష్టంగా కనిపించిందని వెల్లడించింది. ఊపిరాడకు చనిపోయిన కారణంగా అటాప్సీ రిపోర్ట్ లో బాధితురాలి ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగినట్టు శరీరమంతా రక్తం గడ్డకట్టినట్టు పేర్కొంది. డాక్టర్ మరణానికి ఊపిరి ఆడక పోవడమే కారణమని వెల్లడించింది. వైద్యురాలు గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండవచ్చని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది .
వీర్యం విషయంలో పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది ఇదే
అదేవిధంగా మృతురాలి శరీరం పైన 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోస్ట్ మార్టం నివేదిక పేర్కొంది. బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని డెడ్ బాడీ పై తెల్లటి చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే కానీ అది వీర్యం కాదని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. అయితే అదేమిటి అన్నది ఈ రిపోర్టులో వెల్లడించలేదు.
నిందితుడి డీఎన్ఏ, పోస్ట్ మార్టం ఆధారాలతో సరిపోలాయి
ఇక మృతదేహంలో పలు ఎముకలు విరిగాయని ఆరోపణలను పోస్టుమార్టం నివేదిక తోసిపుచ్చింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు ఏవీ లేవని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. వైద్యురాలి అత్యాచారం హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ డీఎన్ఏ ఆధారాలు పోస్ట్ మార్టం నివేదికలోని మృతురాలి గోళ్ళలో ఉన్న రక్తం, చర్మ ఆధారాలతో సరిపోలాయని దర్యాప్తు అధికారులు నివేదికల ఆధారంగా గుర్తించారు.అతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.