ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలకు మరో ఏడు కలిపి 14కు విస్తరించనుంది. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయకుడు కీలక ప్రకటన చేశాడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయకుడు, సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
ఏపీలో విమానయాన రంగ అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ప్రతిపాదనలపై అధికారులకు వివరించారు. అలాగే ఏపీలోని విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఈ మేరకు ఏపీలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై కేంద్ర మంత్రి మాట్లాడారు.
ఏపీలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే..తమ శాఖ తరఫున సహకారం అందిస్తామన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు గుర్తించినట్లు మంత్రి వివరించారు. అలాగే శ్రీశైలం, ప్రకాశంచ బ్యారేజ్ లో సీ ప్లేన్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
కొత్తగా ఏర్పాటు చేసే విమానాశ్రయాల్లో తొలుత శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ లను అభివృద్ధి చేయాలని గుర్తించామని మంత్రి అన్నారు. ఆ తర్వాత తుని అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో ఉన్న అవకాశాలను అధ్యయన చేస్తామన్నారు. ఇక, పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయిర్ పోర్టును ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు.