రాఖీ పండుగ సందర్భంగా ఏపీ వాసులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. త్వరలోనే ఏపీలో రైల్వేజోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నది. ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్తున్నాయన్నారు. భూ కేటాయింపు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారమున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తొందర్లోనే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి సన్నాహాలకు సిద్ధమవుతామంటూ ఆయన పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూమి కేటాయింపుల విషయంలో అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరు ప్రభుత్వాల అధికారుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని, దీంతో రైల్వే జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డుంకులన్నీ తొలగిపోయినట్లు కేంద్రమంత్రి వివరించారు. చివరగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఏపీ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయంటూ వైష్ణవ్ చెప్పారు.