టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి సమావేశంలో పలు అంశాల పైన చర్చ చేసారు. పాలనా పరంగా సంస్కరణలు అవసరమని ఆ దిశగా కార్యచరణ సిద్దం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమం ఇప్పుడు మరోసారి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నామినేటెడ్ పదవుల పంపకాలపైన నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు కసరత్తు టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం పైన చర్చించారు. తెలంగానలో కొత్త పార్టీ అధ్యక్షుడి ఎంపిక అధికారం చంద్రబాబుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి నియామకం పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలోని ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించిన తరువాత నూతన అధ్యక్షుడి నియామకం పైన ప్రకటన చేయనున్నారు. తెలంగాణ నేతలకు టీటీడీ బోర్డులో అవకాశం పైన హామీ దక్కినట్లు తెలుస్తోంది.
మరోసారి జన్మభూమి ఇక, ఇదే సమయంలో చంద్రబాబు కీలక నిర్ణయం వెల్లడించారు. ఏపీలో త్వరలో జన్మభూమి -2ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయి నుంచి సమూల మార్పులు అవసరమని వివరించారు. ఇందు లో ప్రజలు, ఎన్నారైలు సహా అందరినీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే మంత్రులతోనూ చర్చించి జన్మభూమి కార్యక్రమం ప్రారంభం..అమలు పైన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 1995 తరహాలోనే తాను సీఎంగా పని చేయాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
పదువల పంపకాలు ఈ సమావేశంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సాయం పైన ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేసారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణనను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతీ సభ్యుడి నియామకం కోసం రూ100 చొప్పున రుసుము ఖరారుచేసారు. నామినేటెడ్ పదవులపైన మూడు పార్టీల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశం పైన ఒక ఫార్ములా సిద్దం చేసామని చంద్రబాబు వెల్లడించారు.పేదరిక నిర్మూలన, జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణపైన పాలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు సమాచారం.