ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక క్రమంగా బీజేపీకి, ప్రధాని మోడీకి దూరమవుతూ ఇండియా కూటమికి దగ్గరవుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మరో అడుగు వేశారు. ఏకంగా పార్లమెంట్ వేదికగా కీలక సమయంలో అంతే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్టీ వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి జాతీయ స్ధాయిలో చర్చకు దారి తీసింది. దీంతో ఏపీలో అధికారం కోల్పోయినా జాతీయ స్దాయిలో వైసీపీ హవా ఏమాత్రం తగ్గలేదని అర్దమవుతోంది.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఈ ఏడాది జరగాల్సిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇవాళ పార్లమెంట్ లో కీలకమైన వక్ఫ్ చట్టం సవరణ బిల్లును తీసుకొచ్చింది. అయితే సరైన కసరత్తు చేయకుండానే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు లోక్ సభలో దీన్ని ప్రవేశపెట్టిన కాసేపటికే అందరికీ అర్దమైపోయింది. ముఖ్యంగా ఈ బిల్లుకు మద్దతు కోరేందుకు తటస్థ పార్టీలైన వైసీపీ, బీజేడీని కూడా బీజేపీ సంప్రదించలేదు. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన చర్చల్లో వైసీపీ తన నిర్ణయం నిర్మొహమాటంగా చెప్పేసింది.
వక్భ్ చట్ట సవరణ బిల్లుపై లోక్ సభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు నేరుగానే చెప్పేశారు. అంతేకాదు ముస్లింల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని వెనక్కితీసుకోవాలన్నారు. ఈ మేరకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పి కేంద్రానికి షాకిచ్చారు. గత పదేళ్లుగా ఎన్డీయే తెచ్చిన ప్రతీ బిల్లుకూ మద్దతిస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు లోక్ సభలో తీసుకున్న నిర్ణయంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతే కాదు ఇండియా కూటమివైపు వెళ్లేందుకు జగన్ నిర్ణయించుకున్నారని, అందుకే ఎన్డీయేను వ్యతిరేకించడం మొదలుపెట్టారన్న చర్చ జాతీయ స్ధాయిలో జరుగుతోంది.