ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. నేడు (బుధవారం) జరిగే మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. అమరావతిలో నేటి నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతి పై మాస్టర్ ప్లాన్ అమలు దిశగా నేటి మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇక..వాలంటీర్ల అంశం పైన మంత్రివర్గంలో చర్చించి..వారి సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలో నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
కీలక అంశాలపై చర్చ ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు కీలక అంశాల పైన చర్చ జరగనుంది. అదికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన నిర్ణయాలు..పాలనా పరంగా చేయాల్సిన మార్పుల గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అమరావతికి కేంద్రం రూ 15 వేల కోట్ల రుణం ఈ ఆర్దిక సంవత్సరంలో ఇప్పించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమరావతిలో పనులు ప్రారంభించేందుకు వీలుగా ఇటీవలే అధ్యయనం చేసేందుకు ఐఐటీ టీంలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసాయి. అమరావతిలో ఆర్ 5 జోన్ తో పాటుగా న్యాయపరమైన సమస్యల పైన నేటి సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
వాలంటీర్ల పై ఏం చేద్దాం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పైన నేటి సమావేశంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లకు రూ 10 వేలు వేతనం ఇస్తూ..వారి సేవలను కొనసాగిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి ఎలాంటి విధులు కేటాయించ లేదు. వాలంటీర్ల సంఖ్యను తగ్గించి..నిర్ణీత కాల వ్యవధికి వారి సేవలను పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో వాలంటీర్లకు నైపుణ్య శిక్షణ గురించి కసరత్తు జరుగుతోంది. నేటి కేబినెట్ భేటీలో వీటి పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పోలవరం పై ముందుకు ఇక, ఉచిత ఇసుక విధానం అమలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మంత్రులకు తన వైఖరి స్పష్టం చేయనున్నారు. ఇక..ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా 33 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. దీంతో పాటుగా.. పోలవరం ప్రాజెక్టు పైన చర్చ చేయనున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును ఎలా గాడిన పెట్టాలన్న విషయమై ఏపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. మిగిలిన పనులను ప్రస్తుత కాంట్రాక్టు సంస్థతోనే చేయించాలా.. లేక,. కొత్త ఏజెన్సీని పిలవాలా అనే విషయమై చర్చిస్తోంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ఎవరికి అప్పగించాలన్న విషయమై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.